Students Protest for Road: 'మాకు రోడ్డు రాదా జగన్ మామయ్యా..' రహదారిపై విద్యార్థుల బైఠాయింపు
School Students Protest for Road in Peddaraveedu: తాము పాఠశాలకు వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేయాలంటూ ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో విద్యార్థులు "జగన్ మామయ్యను" వేడుకున్నారు. చాట్లమడ గ్రామానికి చెందిన విద్యార్థులు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాము పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చాట్లమడ గ్రామం నుంచి నిత్యం సుమారు 60 మంది వరకు మద్దలకట్టలోని ప్రభుత్వ పాఠశాలకు వెళతారు. తాము స్కూల్‌కి వెళ్లేందుకు కనీసం రహదారి కూడా సరిగ్గా లేక అష్టకష్టాలు పడుతూ పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. వర్షాకాలం వస్తే రహదారి మొత్తం బురదమయంగా మారి సైకిళ్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీంతో పాఠశాల మానుకోవాల్సి వస్తుందని విద్యార్థులు వారి గోడును "విద్యార్థుల బాధ..రోడ్డు మాకు రాదా" అంటూ ఫ్లకార్డుల రూపంలో నిరసన తెలియజేశారు. స్థానిక మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టికి పలు మార్లు ఈ సమస్యను తీసుకెళ్లినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.