పొలం వివాదం - ట్రాక్టర్‌తో తొక్కించి సర్పంచ్ భర్తతో సహా మరో వ్యక్తి హత్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2023, 5:08 PM IST
|Updated : Dec 29, 2023, 5:30 PM IST
Sarpanch Husband and Other Person Murder: పొలం వివాదంలో తలెత్తిన ఘర్షణలో ట్రాక్టర్ తొక్కించి ఇద్దరిని హతమార్చిన ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో చోటు చేసుకుంది. భీమవరం గ్రామంలో భూ వివాదంలో జరిగిన ఘర్షణలో గ్రామ సర్పంచ్ భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి తీవ్రగాలయ్యాయి. భీమవరం గ్రామ సర్పంచ్ భర్త మంద రామరత్నారెడ్డికి ఆయన తమ్ముడు కుమారుడు అయిన మంద రఘురామిరెడ్డికి మధ్య గత కొన్ని ఏళ్లుగా పొలం వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రఘురామిరెడ్డి వివాదంలో ఉన్న పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతున్నాడనే సమాచారం తెలియడంతో రత్నారెడ్డి అతని భార్య ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లి అతనిని అడ్డుకున్నారు. దీంతో ఆ వివాదం కాస్త పెద్దదవడంతో రఘురాం రెడ్డి అడ్డొచ్చిన వారందరి పైనా విచక్షణారహితంగా ట్రాక్టర్‌తో తొక్కించాడు. ఈ ఘటనలో సర్పంచ్ భర్త రామ రత్నారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి పరామర్శించారు. మరోవైపు జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Murder with Tractor: తాజాగా పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బురదలో కూరుకుపోయిన శ్రీనివాస్ రెడ్డి అనే మరో వ్యక్తి మృతదేహం గుర్తించినట్టు వెల్లడించారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం సమీప బంధువులు అయిన రఘురామి రెడ్డి, రామరత్నారెడ్డి కుటుంబాల మధ్య భూవివాదం ఉంది. రామరత్నారెడ్డి తండ్రి చిన్నయ్యకు 16 ఎకరాల పొలం ఉంది. చిన్నయ్య అన్నకొడుకు అయిన రఘురామి రెడ్డి 2018లో ఈ భూమిని తన తల్లి నాగమ్మ పేరుపై ఆన్లైన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య భూ వివాదం నెలకొంది. ఈనెల 24న రామరత్నారెడ్డి రెవెన్యూ అధికారులను భూ విషయంలో న్యాయం చేయాలని కోరాగా, విచారణ చేపట్టిన అధికారులు ఈ పొలం రామరత్నారెడ్డికి చెందుతుందని ద్రువీకరించారు. ఈ క్రమంలో రఘురామిరెడ్డి - కృష్ణవేణి దంపతులు అదే పొలంలో పనులు చేస్తుండగా ఆగ్రహానికి గురైన రామరత్నారెడ్డి తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పొలం వద్దకు వెళ్లారు. అక్కడ ఇరువురు మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోగా రఘురామిరెడ్డి భార్య తలకు దెబ్బతగిలి పడిపోయారు. కోపొద్రిక్తుడైన రఘురామిరెడ్డి అడ్డొచ్చిన వారందరిపై విచక్షణా రహితంగా ట్రాక్టర్‌తో తొక్కించాడు. ఈ క్రమంలో రామరత్నారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పైకి ఎక్కించి పరారయ్యాడు. రామరత్నారెడ్డిని మాత్రమే గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గ మధ్యలోనే మృతి చెందారు. శుక్రవారం పోలీసుల అదుపులో ఉన్న రఘరామరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కూడా హతమర్చినట్టు విచారణలో వెల్లడించారు.