కోనసీమ జిల్లాలో ముందస్తు సంక్రాంతి సంబరాలు.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విద్యార్థినులు
Sankranti celebrations started in Konaseema district: కోనసీమ జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలైయ్యాయి. మండలాలు, గ్రామాలన్నీ సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. పాఠశాలలకు, కళాశాలలకు సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో విద్యార్థులు పలుచోట్ల ముందస్తు సంక్రాంతి సంబరాలను కోలాహలంగా జరుపుకున్నారు.
నిత్యం ప్రాజెక్టులు.. కొత్త కొత్త ఆవిష్కరణలు.. ఇతర కళాశాలతో పోటీపడేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో బిజీబిజీగా ఉండే విద్యార్థులు.. సంప్రదాయ దుస్తులు ధరించి, భోగి మంటలు వేసి, గొబ్బెమ్మల చుట్టూ కోలాటం నృత్యాలు చేశారు. అనంతరం యువత ప్రభలు ఊరేగించి సందడి చేశారు. సంస్కృతి సాంప్రదాయాలు.. ఆచార వ్యవహారాలపై ఒక్కరోజు దృష్టి సారించి.. కనుమరుగవుతున్న మన సంప్రదాయాలను తర్వాత తరాలకు తెలియజేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా చేయ్యేరులోని శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. కళాశాల ప్రాంగణంలో తెలుగు లోగిళ్ళ శోభను ఆవిష్కరించేలా రంగురంగుల ముగ్గులను సుందరంగా తీర్చిదిద్దారు. కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, భోగి మంటను వెలిగించారు. విద్యార్థిని సంప్రదాయ దుస్తులు ధరించి భోగిమంట చుట్టూ పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. అనంతరం సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు.