Ration Vehicle Operators Protest:వాహనాలు నిలిపి.. ఎండీయూ ఆపరేటర్ల నిరసన.. సమయం వృధా అవుతోందని ఆవేదన
Mdu Vehicle Operator Protest In Kundurpi: వివిధ గ్రామాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసే ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాలను తహశీల్దార్ కార్యాలయం ముందు నిలిపి.. వాటి నిర్వాహకులు నిరసన తెలియజేసిన ఘటన అనంతపురం జిల్లా కుందుర్పిలో జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎండీయూ ఆపరేటర్లు ప్రతి నెల 15వ తేదీలోగా రెండు పర్యాయాలు రేషన్ కార్డు ఉన్న ఇంటింటికీ నిత్యావసర వస్తువులను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇలా నిత్యావసర సరుకులను ఇంటింటికీ సరఫరా చేసే క్రమంలో వారికి పలు సమస్యలు ఎదురవుతున్నాయని ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు ఇంటింటికీ వెళ్లినప్పుడు పలు నెట్వర్క్ సమస్యలు ఏర్పడి బయోమెట్రిక్ మిషన్‌లో వేలిముద్రలు తీసుకునేందుకు చాలా సమయం వృధాగా పోతోందని వారు వాపోయారు. ఈ నెట్వర్క్ సమస్యను అధిగమించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్‌కు వారు వినతి పత్రాన్ని అందించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక బియ్యం సహా నిత్యావసర సరకులను ఇంటింటికి అందించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎండీయూలను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.