Protest Against YSRCP MLA Mustafa: వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు నిరసన సెగ.. ప్రశ్నించిన స్థానికులతో పార్టీ నాయకుల వాగ్వాదం - YSRCP MLA Mustafa news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 7:26 PM IST
Protest Against YSRCP MLA Mustafa:రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'జగనన్న సురక్ష' కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు తిప్పలు తప్పటం లేదు. ప్రజల బాగోగులను తెలుసుకునేందుకు వెళ్లిన నాయకులకు స్థానికుల నుంచి నిరసన సెగలు ఎదురవుతున్నాయి. ఓట్లేసి గెలిపించినందుకు తమ సమస్యల పరిష్కారానికి, కాలనీ, వీధుల అభివృద్ధికి ఏం చేశారంటూ స్థానికులు నిలదీస్తున్నారు. స్థానికుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెనుదిరుగుతున్నారు. తాజాగా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు కూడా నిరసన ఎదురైంది.
Womens Fire on MLA Mustafa: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. పాత గుంటూరు 8వ డివిజన్‌లో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ముస్తఫా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన మహిళలు.. డ్రైనేజీ కాలువలు బాగు చేయించకపోవడంపై నిలదీశారు. మురుగునీరంతా ఇళ్లవైపు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దోమలతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ఆవేదన చెందారు. కాలువల్లో చిన్న పిల్లలు పడిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో సమస్యను త్వరలోనే పరిష్కారిస్తానంటూ.. ఎమ్మెల్యే ముస్తఫా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యేని నిలదీసిన స్థానికులతో వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు.