జగనన్న కాలనీల భూముల కోసం భారీ కుంభకోణం జరిగింది: నాదెండ్ల మనోహర్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 16, 2023, 6:06 PM IST
Nadendla Manohar on Jagananna Colony Scheme: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన 'వైఎస్సార్ జగనన్న కాలనీ' పథకంలో భారీగా అవినీతి జరిగిందని.. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నది ఇళ్లు కాదు - కొత్తగా ఊర్లే నిర్మిస్తామని జగన్ చెప్పిన మాటలు నమ్మి.. ప్రజలు దారుణంగా మోసపోయారని దుయ్యబట్టారు. భూముల కొనుగోళ్ల విషయంలో.. ఏ మాత్రం విలువలేని భూములను రూ.లక్షలు చెల్లించి, కొనుగోలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nadendla Manohar Comments:''జగనన్న కాలనీల్లో కొత్తగా ఊర్లే నిర్మిస్తున్నామని జగన్ చెప్పిన మాటలు నమ్మి, ప్రజలు మోసపోయారు. జగనన్న కాలనీపై జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో జగనన్న కాలనీలో భారీగా అవినీతి జరిగినట్లు తేలింది. అంతేకాదు, భూముల కొనుగోళ్లలో కూడా భారీగా కుంభకోణం జరిగింది. ఏ మాత్రం విలువలేని భూములను రూ.లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. నచ్చిన వారికి రూ.లక్షల్లో చెల్లించి భూములు కొన్నారు. జగనన్న కాలనీల కోసం 25,375 ఎకరాలు కొనుగోలు చేశారు. భూమి కొనుగోళ్ల కోసం రూ.56,102 కోట్లు ఖర్చు చేసినట్లు ఈ జగన్ ప్రభుత్వమే చెప్పింది. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా అంత డబ్బు ఎలా ఖర్చు చేశారు..? 68,350 ఎకరాల భూసేకరణ చేసినట్లు నీతి ఆయోగ్‌కు చెప్పారు. సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పిన విషయాలు, నీతి ఆయోగ్‌కు ఇచ్చిన నివేదిక పరస్పర విరుద్ధంగా ఉంది'' అని నాదెండ్ల మనోహర్ అన్నారు.