MLA Protest: దళితుల రక్తం కళ్ళజూసిన ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: ఎమ్మెల్యే నిమ్మల - Eluru District latest news
MLA Protest: దళితుల రక్తం కళ్ళజూసిన ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న దళితుల భూముల్లో వైసీపీ నాయకుల అక్రమ మట్టి తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఎస్సీలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే నిమ్మల.. ఇవాళ లంక భూముల పరిశీలనకు ఉద్యమించారు. పార్టీ ఆదేశానుసారం కమిటీ వేసి కమిటీలోని సభ్యులు పీతల సుజాత, వంగలపూడి అనిత, గొల్లపల్లి సూర్యారావు, పిల్లి మాణిక్యాల రావు, టీడీపీ శ్రేణులు, దళితులు, సీపీఎం నాయకులతో కలిసి లంక భూముల పరిశీలనకు యత్నించారు. పాలకొల్లులోని ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి బయలుదేరిన కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు చించినాడ చేరుకుని అక్కడ దీక్షా శిబిరంలో నిరసన తెలుపుతున్న దళితులకు సంఘీభావం తెలిపారు. అనంతరం చించినాడ గ్రామానికి చేరుకుని. పోలిసుల లాఠీ ఛార్జిలో గాయపడిన ఎస్సీలను పరామర్శించారు. అక్కడి నుంచి లంక భూముల పరిశీలనకు వెళ్తున్న కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీసులు ఎంతకీ అనుమతి ఇవ్వకపోవడంతో.. అక్కడి నుంచి వెనుదిరిగారు.