Amarnath Counter to KCR: "అచ్యుతాపురంలో ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు" - సీఎం కేసీఆర్
YSRCP Minister Amarnath responded CM KCR's comments: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూముల ధరలపై రాజకీయ వ్యాఖ్యలు రగులుతున్నాయి. అభివృద్ధి కోణంలో మాట్లాడుతున్న నాయకులు భూముల ధరలను ఉదాహరణగా చెప్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. తెలంగాణాలో ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు కొనొచ్చు అని వ్యాఖ్యానించగా.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఏపీలోనూ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని, ఆంధ్రప్రదేశ్లోని అచ్యుతాపురంలో ఎకరా స్థలం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనవచ్చు అని పేర్కొన్నారు. ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్న మంత్రి అమర్నాథ్.. తెలంగాణలో ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందిందని అన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే పక్క రాష్ట్రాలను కేసీఆర్ కించపరుస్తున్నారని అమర్‌నాథ్ ఆరోపించారు. ఒక్క శాతం ఓటు లేని బీజేపీతో కలిసి చంద్రబాబు, పవన్ ఏమీ సాధించలేరు అని ఈ సందర్భంగా అమర్నాథ్ పేర్కొన్నారు.