Kadapa Steel Plant Lands: ఉక్కు పరిశ్రమ కోసం భూములిచ్చిన రైతులు.. పరిహారం ఇవ్వకుండా తిప్పించుకుంటున్న అధికారులు
Kadapa Steel Plant Lands: వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్(YSR STEEL CORPORATION) నిర్వాసితులు పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి త్వరగా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలానికి చెందిన సున్నపురాళ్లపల్లె, పెద్ద దండ్లూరు, సిరిగేపల్లి గ్రామానికి చెందిన భూమి కోల్పోయిన.. రైతులు తమకు పరిహారం త్వరగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జమ్మలమడుగు లోని ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని.. అధికారులకు తమ సమస్యను విన్నవించుకున్నారు. ఉక్కు పరిశ్రమ కోసం సున్నపురాళ్లపల్లె, సిరిగేపల్లి గ్రామానికి చెందిన 192 మంది బాధిత రైతుల్లో 137 మందికి పరిహారం మంజూరైంది. మిగిలిన 55 మందికి వివిధ కారణాలతో పరిహారం అందలేదు. పెద్ద దండ్లూరు గ్రామంలో 187 మంది బాధితుల్లో 149 మందికి పరిహారం రాగా మిగిలిన 38 మంది పేర్లు జాబితాలో లేవు. రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు.