జల్లికట్టు నిర్వహించొద్దని పోలీసుల హెచ్చరిక - ఆనవాయితీ అంటున్న గ్రామస్థులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 12:50 PM IST
Jallikattu festival Is Celebrate in Chittoor District: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద పండుగగా భావించే సంక్రాంతికి పరస పందాలను నిర్వహించుకోవడం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆనవాయితీగా కొనసాగుతోంది. పశువుల పరసపై (జల్లికట్టు) ఉన్న మక్కువతో గ్రామస్థులు సంక్రాంతి రాకుండా ముందుగానే ఈ పోటీలను నిర్వహించుకుంటున్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం గోవిందవారి పల్లెలో జల్లికట్టు సంబరాలు ఉత్సవంగా జరుగుతున్నాయి. జల్లికట్టును విక్షించేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఔత్సాహికులు పోటెత్తారు. ఈ పోటీలను తిలకించడానికి వచ్చిన వారికి గ్రామస్థులు భోజన వసతి ఏర్పాట్లు చేశారు.
Police Warning Not Organize in Jallikattu: పరస పందేం ప్రారంభం కావడంతో వేగంగా దూసుకు వస్తున్న ఎద్దులను నిలువరించడానికి యువకులు పోటీ పడ్డారు. ఈ విధంగా ఎద్దులను నిలువరించే క్రమంలో యువకులు వాటి కింద పడినప్పటికీ మళ్లీ మళ్లీ యత్నించేవారు. ఎద్దుల దాటికి కిందపడి రొప్పుతూ బతుకు జీవుడా అంటూ వెళ్లే వారిని చూస్తూ ప్రజలు కేరింతలు కొడుతున్నారు. జల్లికట్టును నిర్వహించ వద్దని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినా గ్రామస్థులు మాత్రం ఈ పండుగపై ఉన్న మక్కువతో పోటీలను నిర్వహిస్తున్నారు.