Janasena Leaders Protest For Roads: 'రోడ్డు వేస్తారా?..కాలువలో పడవలు ఏర్పాటు చేస్తారా?..జనసైనికులు వినూత్న నిరసన
Janasena Leaders Protest For Roads : కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి కోడూరు వరకూ సుమారు 13 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రధాన రహదారి నిర్మాణం కోసం జనసైనికులు వినూత్న పద్దతిలో నిరసన చేపట్టారు. పంట కాలువలో పడవ ప్రయాణం చేసి నిరసన తెలిపారు. నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం కోడూరు రోడ్డును నిర్మించలేదని వారు అన్నారు. రెండు సంవత్సరాల క్రితం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, అలాగే ఏడాది క్రితం సీఎం జగన్ అవనిగడ్డ వచ్చి నూతన రోడ్డు వేస్తామన్నారని, ఈ సందర్భంగా జనసైనికులు గుర్తు చేశారు. ఇప్పటికీ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డును వైసీపీ నాయకులు ఏటీయం మిషన్లా వాడుతున్నారని మరమ్మతు పేరుతో ప్రతి సారి లక్షల రూపాయలు కాజేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఈ రోడ్డు స్టేటస్ ఏంటో ప్రకటించాలని, లేకుంటే ఈ రహదారి పక్కన కాలువలో పడవలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.