విశాఖలో జీ-20 సదస్సు.. గ్రీన్ మ్యాట్ చాటున పేదల గుడిసెలు
Visakha Greenmat at Slum areas: విశాఖలో జరుగుతున్న జీ-20 సదస్సు ముస్తాబులో భాగంగా ఇటీవల రుషికొండకు గ్రీన్ మాట్ వేసింది విశాఖ జిల్లా యంత్రాంగం. అయితే తాజాగా పేద వర్గ ప్రజలు నివసించే ప్రాంతాలను కూడా గ్రీన్ మాట్ పరదా మాటున నిలిపింది. ఇలా విశాఖ మహానగర పాలక సంస్థ 45వ డివిజన్ చిట్టిబాబు కాలనీ సమీపంలో రోడ్ పక్కనే నివసిస్తున్న గుడిసెలు కనపించకుండా గ్రీన్ మాట్తో కప్పేశారు అధికారులు. అంతటితో ఆగకుండా జీ-20 సదస్సు ఫ్లెక్సీలు పెట్టి హడావుడి చేశారు. సదస్సు కోసం వేల కోట్లు ఖర్చు పెడుతూ.. అతిథులుగా వచ్చే విదేశీ ప్రముఖులకు వాస్తవాలు తెలియకుండా ఇలా పరదాలు మాటున దాచటం ఏంటి? అని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ తాడిచెట్ల పాలెం కూడలి నుంచి అక్కయపాలెం కూడలి వరకు సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలోనే అంబేడ్కర్ ఆవాస్ యోజన, రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని జోడించి కాలనీ నిర్మించారు. అయితే ఆ కాలనీ కనిపించకుండా ఉండేందుకు పరదాలు కట్టడంపై స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జీ-20సదస్సులో ప్రముఖులతో మాట్లాడిన సందర్భంలో రాష్ట్రంలో గృహ నిర్మాణాల ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే విశాఖలో పేద వర్గ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను ఇలా గ్రీన్ మాట్తో కనపడకుండా ఏర్పాట్లు చేయడం హేయమైన చర్యగా స్థానికులు అభివర్ణించారు.