Government School Collapsed: కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల భవనం.. సెలవు కావడంతో తప్పిన పెను ప్రమాదం
School Collapsed: వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది. క్షణంలో.. అందరూ చూస్తుండగానే శిథిలావస్థకు చేరుకున్న భవనం నేలమట్టమైంది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం బాపనకుంటలో జరిగింది.. ఈ రోజు పాఠశాలకు సెలవు కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఏడాది నుంచి భవనం పూర్తిగా దెబ్బతినడంతో విద్యార్థులను తల్లిదండ్రులు భయం భయంగానే పాఠశాలకు పంపిస్తున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని పలుమార్లు సమస్యను గ్రామస్థులు, ఉపాధ్యాయులు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. నాడు-నేడు కింద నూతన భవనం నిర్మించకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు స్కూల్ ఉన్నట్లయితే పరిస్థితి మరోలా ఉండేదని.. సెలవు కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు పెద్ద గండం తప్పిందని అభిప్రాయపడ్డారు. కళ్ల ముందే పాఠశాల భవనం కుప్పకూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల భవనం నిర్మించాలని కోరుతున్నారు.