TDP Leader Devineni Uma: వైఎస్సార్సీపీ మాఫియా చెరువులు, కొండలు మింగేస్తోంది: దేవినేని - వైఎస్సార్సీపీ నేతల దందా
TDP Leader Devineni Uma: విజయవాడ రూరల్ మండలం నున్నలో జరుగుతున్న టీడీపీ బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర విమర్శలు చేశారు. భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకులు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వంశీమోహన్ అని ధ్వజమెత్తారు. పౌరుషాల గడ్డ కృష్ణాజిల్లాలో గుడివాడ, గన్నవరం పేరు చెప్పుకోవాలంటేనే సిగ్గు పడుతున్నారన్నారు. గన్నవరం, మైలవరం నియోజకవర్గాల పరిధిలో చెరువులు, కొండలు తవ్వి కోట్లను అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పార్టీ మ్యానిఫెస్టోను వివరించారు. వైఎస్సార్సీపీ పాలనలో దోపిడీ, అరాచకం తప్ప మరేదీ లేదంటూ విమర్శించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ... పట్టిసీమ నీళ్లు తెచ్చారా..? భయంలో బతకొద్దు.. భయం అనేది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల డీఎన్ఏలో లేదు. టీడీపీలో గెలిచి ప్రాణభయంతో జగన్ పంచన చేరిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ అరాచకాలకు పాల్పడుతున్నాడు అని పేర్కొన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని నాయకులను, కార్యకర్తలను హింసిస్తారా..? అని ప్రశ్నించారు. ఇళ్లల్లోకి చొరబడి, బెడ్రూంలోకి కూడా వెళ్లి ఆడపిల్లల్ని లాక్కొని వస్తారా అని దేవినేని మండిపడ్డారు.