రైతుల సమస్యలు పట్టించుకోని వైసీపీ నేతలు ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారు ?: కాలవ శ్రీనివాసులు - ట్యాంకర్ల నీటితో పంటను కాపాడుతున్న రైతులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 24, 2023, 11:29 AM IST
Farmers Try To Save Crop With Tankers Water: తుంగభద్ర జలాశయంలో రాష్ట్ర వాటా మూడున్నర టీఎంసీల నీరు ఉందన్న విషయం కూడా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుకు తెలియకపోవటంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. బొమ్మనహాల్ మండలంలో హెచ్ఎల్సీ ఆయకట్టు కింద ఎండిపోతున్న పంటలను పరిశీలించి, రైతుల కష్టాన్ని తెలుసుకున్నారు. నీటి నిర్వహణ కూడా చేతకాని జగన్ ప్రభుత్వంతో హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులకు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగిందన్నారు. తుంగభద్ర ఎగువ కాలువకు నీటిని నిలిపివేయటంతో రైతులు ట్యాంకర్లతో పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పట్టని వైసీపీ ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడగటానికి పోతారని శ్రీనివాసులు ప్రశ్నించారు.
మామూలుగా పంటలు ఎండిపోయాయంటే ప్రకృతి కరుణించక అనుకుంటాం. కానీ ఇక్కడ పాలకుల పాపం వల్ల ఈ పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. తుంగభద్ర జలాశయంలో రాష్ట్ర వాటా మూడున్నర టీఎంసీల ఉన్న నీటిని ఉపయోగించుకోవడం లేదు. ఒక్క టీఎంసీ నీటిని తీసుకొచ్చిన ఈ పంటలన్నీ పండేవి. కానీ ఎవ్వరికీ నీటిపై శ్రద్ధ లేదు. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఎందుకు ఈ నీరు ఉండిపోయిందని సమీక్ష చేసి ఉంటే, ఈ పంటలు అన్నీ ఎండిపోవు. -కాలవ శ్రీనివాసులు, మాజీమంత్రి