ఎటు చూసినా కన్నీటి చిత్రం - బాధితుల కష్టాలు వర్ణనాతీతం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2023, 10:39 PM IST
Prathidwani: ఎటు చూసినా ఒకటే కన్నీటి చిత్రం. ఒకవైపు నీట నానుతున్న పంట పొలాలు. మరోవైపు జల దిగ్భంధనంలో చిక్కుకున్న జనావాసాలు. ముంచెత్తిన మిగ్‌జాం తుపాను తెచ్చిన అకాల కష్టమిది. అది చేసిన, చేస్తున్న నష్టం కూడా భారీగానే ఉంది. పంట కోసిన రైతులు ధాన్యం రాసుల వద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే పంటలు కోయని రైతులు పొలం గట్ల వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నారు. నివాస ప్రాంతాల్లో చూస్తే రోడ్డేదో, డ్రైనేదో కూడా గుర్తు పట్టలేని దయనీమైన పరిస్థితుల్లో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఇళ్లల్లో ఉండలేక, బయటపడే దారి కానరాక, తింటానికి తిండి లేకుండా ఆదుకునేవారి కోసం ఎదురుచూస్తున్న వారందెరో. అలానే మిగ్‌జాం ప్రభావంతో పట్ణణాల్లో పౌరులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. మరి ఈ కష్ట కాలంలో ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? అసలు వాళ్లేం చేయాలి? ఏం చేస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.