CPI Ramakrishna On Power Charges: విద్యుత్ ఛార్జీల పెంపుపై.. రేపు సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు
Tomorrow Protests under CPI across the state: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలపై.. జూన్ 30వ తేదీన (రేపు) రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులపై ఈ ప్రభుత్వం మోయలేని భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. రేపు విద్యుత్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనున్న నిరసనల్లో ప్రజలు, యువత పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..''రేపు (జూన్ 30) రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాం. ఎందుకంటే.. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం అదానీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్ సంస్థలతో లాలూచీపడి.. విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. ప్రజలపై పెను భారాన్ని మోపారు. కాబట్టి పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. రేపు 26 జిల్లాల్లో ఉన్న విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టనున్నాం. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నాం. దేశంలో అతి తక్కువ మూలధన వ్యయం చేస్తున్న రాష్ట్రం ఏపీనే. దేశంలో 17 శాతం, రాష్ట్రంలో 35 శాతం నిరుద్యోగిత ఉంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కన్పిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా జగన్ ఇట్లే కొనసాగితే.. రాష్ట్రం అంధకారంలోకి పోవడం మాత్రం తథ్యం'' అని ఆయన అన్నారు.