చనిపోయిన బంధువుకు పింఛన్ ఆపేశాననే కక్షతోనే దాడి చేశారు: వాలంటీర్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 12:14 PM IST
Dispute between MPTC volunteer : చనిపోయిన బంధువుకు పింఛన్ ఆపేశాననే కక్షతో వైసీపీ ఎంపీటీసీ (MPTC) సభ్యురాలు, ఆమె కుటుంబసభ్యులు తనపై దాడి చేసి.. అమానుషంగా ప్రవర్తించాంటూ.. శ్రీసత్యసాయి జిల్లా అగళి మండలం కదిరేపల్లికి చెందిన మహిళా వాలంటీరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. తనకు, తన కుటుంబానికి మడకశిర వైసీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ఎంపీటీసీ కుటుంబసభ్యులు, స్థానిక నాయకులతో ప్రాణహాని ఉందని వాలంటీర్ పేర్కొన్నారు.
Dispute between MPTC volunteer :పింఛను ఆపేశాననే కోపంతో ఎంపీటీసీ(MPTC) సభ్యురాలు నింగమ్మ భర్త బసవరాజు, మరికొంతమంది కలిసి మొదట తనతో గొడవపడ్డారని, తర్వాత తన సోదరుడిపై దాడి చేశారని.. ఈ విషయమై ప్రశ్నించడానికి వెళితే తన తమ్ముడిని, తల్లిని కొట్టి, తన దుస్తులు చింపి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. పైగా తమ మీదనే తప్పుడు కేసు పెట్టగా.. సోమవారం తమ కుటుంబ సభ్యులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. దీనిపై ఎంపీటీసీ భర్త బసవరాజు మాట్లాడుతూ.. వాలంటీరు కుటుంబసభ్యులే తనపై దాడి చేశారని చెప్పారు. ఈ వివాదంపై ఎస్సై లావణ్యను వివరణ కోరగా, ఇటీవల ఓ వివాదానికి సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు వాలంటీరు కుటుంబ సభ్యులు నలుగురిని అరెస్టు చేశామన్నారు. అలాగే ఎంపీటీసీ కుటుంబసభ్యులు 16 మందిపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు.