CPM Leader Srinivasa Rao Fire On Praveen Prakash: "విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వేధింపులు ఎక్కువయ్యాయి''
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2023, 5:25 PM IST
CPM Leader Srinivasa Rao Fire On Praveen Prakash : పాఠశాలల విలీనం పేరుతో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో 5400 స్కూళ్లు మూతపడ్డాయని అన్నారు. సెప్టెంబర్ నాలుగో తేదీ వరకు సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ రావు తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై సెప్టెంబర్ మూడవ తేదీన నిరుద్యోగ వ్యతిరేక దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్త సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే డీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 4 వరకు పెరిగిన ధరలు, విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌పై శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవీణ్ ప్రకాష్ టీచర్లను వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థలో ప్రకాష్ వేధింపులు ఎక్కువయ్యాయని ఆయన మండిపడ్డారు. చదువును గాలికి వదిలేసి, యాప్‌ల పనే టీచర్లకు సరిపోతుందన్నారు. పాఠశాలల విలీనం పేరుతో విద్యా వ్యవస్థ సర్వనాశనం చేశారని ప్రభుత్వ ద్వంద్వ విధానాలతో 5400 స్కూళ్లు మూతపడ్డాయని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.