Cashew Farmers: జీడి పంట మద్దతు ధర కోసం రైతుల పోరుబాట.. మహాధర్నాకు పిలుపు - Support Price for Cashew Crop
Cashew Farmers Association: జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని జీడి రైతు సంఘం నేతలు శ్రీకాకుళం జిల్లా కవిటిలో డిమాండ్ చేశారు. జీడి రైతు పోరుబాట పేరుతో జులై 18వ తేదీన నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రతి పంటను ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. జీడి పంటను కూడా కొనుగోలు చేయాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. జీడి పంటకు మద్దతు ధర లేక రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం.. రైతు ప్రభుత్వం మాదే అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం జీడికి ఎందుకు మద్దతు ధర ప్రకటించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతో జీడి పరిశ్రమ యజమానులు.. రైతులను తీవ్రంగా దోచుకుంటున్నారని విమర్శించారు. ఒకవైపున జీడి పప్పు ధర పెరుగుతూ ఉంటే మరొక వైపు.. జీడి పిక్కల ధర మాత్రం తగ్గుతూ వచ్చిందని.. దీనికి కారణం జీడి వ్యాపారులు సిండికేట్గా మారి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.