భారత్ అంధుల క్రికెట్ కెప్టెన్ అజయ్ కుమార్‌రెడ్డికి అర్జున అవార్డు - క్రికెట్ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 12:11 PM IST
|Updated : Dec 21, 2023, 2:56 PM IST
Arjuna Award to be Conferred to Illuri Ajay Kumar Reddy: పల్నాడు జిల్లాకు చెందిన అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన భారత్ అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. మాచర్లలో పుట్టి పెరిగిన అజయ్ కుమార్ నరసరావుపేటలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడే క్రికెట్ ఆడటం నేర్చుకున్నారు. అంచెలంచెలుగా రాణిస్తూ భారత జట్టుకు ఆడటంతో పాటు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు. 2010లో ఇంగ్లాండ్ టూర్ కు ఎంపికైన అజయ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. 2012లో వైస్ కెప్టెన్‌గా ఎంపియ్యాడు. అప్పుడు జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలవటంలో కీలకపాత్ర పోషించాడు.
2014లో అంధుల ప్రపంచకప్ సాధించిన జట్టులోనూ అజయ్ కుమార్ ఉన్నాడు. 2016లో భారత జట్టు సారథిగా ఎంపికయ్యాడు. 2017 అంధుల టీ20 ప్రపంచ కప్‌లో 9 వికెట్లు సాధించి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించారు. అలాగే అజయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే భారత జట్టు టీ20 ప్రపంచ కప్ సాధించింది. 2018లో జరిగిన ప్రపంచ కప్‌కు అజయ్ కుమార్ రెడ్డి సారథిగా వ్యవహరించాడు. ఆయన నేతృత్వంలోనే భారత్ ప్రపంచ కప్ సాధించింది. కీలకమైన మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఎస్బీఐలో పని చేస్తున్నారు. అర్జున అవార్డు రావటంపై అజయ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింతగా రాణించేందుకు ఈ అవార్డు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు.
TAGGED:
Mr Illuri Ajay Kumar Reddy