మళ్లీ మా ప్రభుత్వం వస్తే డిమాండ్లు నెరవేరుస్తాం - అడ్డుకున్న అంగన్వాడీలతో మంత్రి బొత్స - Andhra Pradesh
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 6:07 PM IST
Anganwadi Workers Stopped Minister Botsa: మంత్రి బొత్స సత్యనారాయణకు అంగన్వాడీల నిరసన సెగ తగిలింది. ఎస్మా ప్రయోగాన్ని రద్దు చేయాలంటూ విజయనగరం జిల్లా గజపతినగరంలో అంగన్వాడీలు మంత్రి బొత్సను అడ్డుకున్నారు. మెంటాడలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరతో కలిసి పింఛన్ల పంపిణీ, గ్రామ సచివాలయం భవనం, చల్లపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం ప్రారంభోత్సవానికి బొత్స వెళ్తుండగా మార్గ మధ్యలో గజపతినగరం రోడ్డుపై అంగన్వాడీలు అడ్డుకున్నారు.
ఎస్మా చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకుని తన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా అంగన్వాడీలు మంత్రిని కోరారు. వినతిపత్రం ఇస్తూ తమ సమస్యలను చెబుతుండగా, అంగన్వాడీలను మాట్లాడనివ్వకుండా బొత్స అడ్డుకున్నారు. మీరు మాట్లాడకండి నా మాట వినండి అంటూ హెచ్చరించారు. మళ్లీ మా ప్రభుత్వం వస్తే మీ డిమాండ్లను నెరవేస్తాం అంటూ అక్కడి నుంచి బొత్స వెళ్లిపోయారు. కాగా కనీస వేతనం పెంపు సహా డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 28వ రోజుకు చేరుకున్నాయి. డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని అంగన్వాడీలు తేల్చిచెప్పారు.