Workers Agitation: డిమాండ్ల సాధనకై.. మున్సిపల్ ఆఫీస్ గేటుకు తాళం వేసిన కార్మికులు - అనంతపురం తాజా వార్తలు
Municipal Workers Protest In Anantapur: అనంతపురం నగరపాలక సంస్థలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. అధిక సంఖ్యలో మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్న కార్మికులు.. నగర పాలక సంస్థ కార్యాలయంలోనికి వెళ్లే గేటుకు తాళం వేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి.. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. మున్సిపల్ కార్మికులకు రావాలసిన పీఎఫ్ బకాయిలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులందరికీ సమాన వేతనం ఇవ్వాలని కోరారు. అలాగే తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె చేయడానికి కూడా సిద్ధమని మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోతే.. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటు వేసే ప్రసక్తే లేదని ఓ కార్మికురాలు స్పష్టం చేసింది.