జగనన్న పోవాలి చంద్రన్న రావాలి- 21వ రోజు అంగన్వాడీల నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 10:23 AM IST
21st Day of Anganwadi Protest: కనీస వేతనం ₹.26వేలు ఇవ్వాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు సోమవారానికి 21వ రోజుకు చేరుకున్నాయి. వేతనాలు పెంపు, గ్రాట్యుటీ, పింఛను అమలు తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆటపాటలతో అంగన్వాడీలు తమ నిరసనను వ్యక్తం చేశారు. జగన్ పాలన పోయి చంద్రబాబు పాలన రావాలన్న పాటకు నంద్యాల జిల్లా పాణ్యంలో అంగన్వాడీలు నృత్యం చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని దీక్షా శిబిరంవద్ద రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని అంగన్వాడి పోరాటాలు వర్ధిల్లాలి అంటూ ముగ్గు వేసి నిరసన తెలిపారు. మ్యూజికల్ ఛైర్స్, కబడ్డీ ఆడి ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని దీక్షా శిబిరంలో అంగన్వాడీలు కేక్ కట్ చేశారు. సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సాఆర్సీపీని ఇంటికి పంపించటం ఖాయమని కార్యకర్తలు అన్నారు.