బద్వేలులో వైకాపా నేత భూ దందా.. వందల ఎకరాల భూముల కాజేత - బద్వేలులో వందల ఎకరాల భూముల కాజేత
ysrcp Land mafia in Badvelu: వైఎస్ఆర్ జిల్లాలో వైకాపా నాయకులు బరితెగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూమి అనే తేడా లేకుండా వందల ఎకరాలు కాజేశారు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్.. ఎంపీగా ఉన్న సమయంలో సిఫార్సు చేసి ఓ మైనార్టీ సంస్థకు ఇచ్చిన భూమిని సైతం వదిలిపెట్టలేదు. కలసపాడు మండలంలో రెవెన్యూ అన్‌లైన్ పోర్ట్‌ల్‌ను అంగడి సరుకులా మార్చుకుని పెద్దఎత్తున భూములు సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్సీ అండదండలతో ఆయన మేనల్లుడే ఈ దందా సాగించాడు.
బద్వేలులో వైకాపా నేత భూ దందా
By
Published : May 8, 2022, 5:55 AM IST
బద్వేలులో వైకాపా నేత భూ దందా
వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలంలో అధికార వైకాపా కీలక నేతలు భూకబ్జాకు పాల్పడ్డారు. వందల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను కాజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో సిఫార్సు చేసి, ఓ మైనారిటీ ట్రస్టుకు కేటాయించిన భూములనూ వదిలిపెట్టలేదు. జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ అండదండలతో ఆయన మేనల్లుడు, వైకాపా మండల ఇన్‌ఛార్జి అంకన గురివిరెడ్డి ఈ భారీ భూ కుంభకోణానికి తెర తీశారు. తన తండ్రి, జడ్పీటిసీ సభ్యుడు అంకన పెద్ద గురివిరెడ్డి, కుటుంబ సభ్యుల పేర్లతో పెద్ద మొత్తంలో భూములకు పట్టాలు, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. మరికొన్నింటిని బినామీల పేర్లతో రాయించి పెట్టుకున్నారు.
కలసపాడు మండలంలోని శంఖంపల్లె, కొత్తకోట, గంగాయపల్లె, నీలాపురం, అయ్యవారిపల్లె, కొంగల రామాపురం రెవెన్యూ గ్రామాల పరిధిలో వందల ఎకరాలు వారి పరమయ్యాయి. ప్రాథమిక విచారణలో 100 ఎకరాలకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు అంచనాకు వచ్చారని సమాచారం. వీటన్నింటికీ 8 మంది పేరిట రిజిస్ట్రేషన్లు, పట్టాలు పొందినట్లు తేలింది.
పోరుమామిళ్లలో ఓ మైనారిటీ ట్రస్టు వైద్య, విద్యాలయాలను స్థాపించింది. ట్రస్టు అవసరాలకు కలసపాడులో 24.63 ఎకరాలను కేటాయించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో కలెక్టర్‌కు లేఖ రాశారు. లేఖలో నమోదు చేసిన 2800-2 సర్వే నంబరు భూములను ట్రస్టుకు 99 ఏళ్ల లీజుకు 2010లో అప్పగించారు. కలసపాడు- పోరుమామిళ్ల ప్రధాన రహదారికి పక్కనే ఉండటంతో ఇక్కడ ఎకరా రూ.50 లక్షల వరకు పలుకుతోంది. వీటిపై కన్నేసిన నేత.. నిషేధిత జాబితాలో ఉన్న ఈ సర్వే నంబరులో 3.50 ఎకరాలు అనువంశికంగా సంక్రమించినట్లుగా అంకన పెద్ద గురివిరెడ్డి పేరిట గత మార్చి 10న రిజిస్టర్ చేయించేసుకున్నారు. ఈ భూముల్ని కాజేసినట్లు ట్రస్టు నిర్వాహకులు కలసపాడు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
అక్రమంగా జిరాయితీ పట్టాల మంజూరు:అంకన పెద్ద గురివిరెడ్డి పేరిట శంఖవరంలో 2804 సర్వే నంబరులో 4.15 ఎకరాలు, 2805-1 సర్వే నంబరులోని 3.24 ఎకరాల ప్రభుత్వ భూమిని జిరాయితీ పట్టా పేరిట రెవెన్యూ అధికారులు ధారాదత్తం చేశారు. ఇవన్నీ వందల ఏళ్లుగా ప్రభుత్వ భూములే.
శంఖవరంలో 1బీలో పెద్ద ఎత్తున డీకేటీ భూములను ఆక్రమించి ఆన్‌లైన్ చేయించుకున్నారు. ఈ ఏడాది మార్చి 10న అంకన పెద్ద గురివిరెడ్డి పేరుతో 3408 ఖాతాలో సర్వే నంబరు 2805-1, 2800-2లో 3.50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్‌లో చేర్చారు. మరో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఆన్‌లైన్ చేయించుకున్నారు.
అంకన గురివిరెడ్డి ఆయన భార్య లక్ష్మీనారాయణమ్మ పేరిట సర్వే నంబరు 630-4, 639-6ఎలో 4 ఎకరాలు, కుమార్తె అంకన లక్ష్మీప్రసన్న పేరిట 2706/52-6లో 2.50 ఎకరాలు, తల్లి, సర్పంచి అంకన గోవిందమ్మ పేరుతో 510-1, 625-1సీలో 3.53 ఎకరాలు, తమ్ముడు అంకన బ్రహ్మానందరెడ్డి పేరిట 629-3, 635-3లో 3.80 ఎకరాలు ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ చేయించారు.
కలసపాడు 1బీ, గంగాయపల్లెల్లో అంకన గురివిరెడ్డి, ఎంపీపీ నిర్మలాదేవి భర్త బి.నారాయణ, బాల అంకిరెడ్డి, పురుషోత్తమరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో ఆక్రమించి ఆన్‌లైన్ చేయించుకున్నారు. ప్రైవేటు భూములనూ తమ పేరిట ఆన్‌లైన్‌లో మార్పించుకున్నారని తెలిసింది.
సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేయడంతో.. :ఈ భూముల వ్యవహారంపై కొందరు వైకాపా నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం సీసీఎల్‌ఏ వరకు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. 'బద్వేలు నియోజకవర్గంలో భూ ఆక్రమణలపై ఫిర్యాదులొచ్చాయి. వారం రోజులుగా విచారణ చేపట్టాం. ఆక్రమిత భూముల క్రయవిక్రయాలు జరగకుండా చర్యలు తీసుకున్నాం. భూముల చిట్టాను తయారుచేసి, వివాద జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను నిలిపివేశాం. విచారణ కొనసాగుతోంది అని బద్వేలుఆర్డీవో వెంకటరమణ అన్నారు.