సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తూ ఆసరాగా ఉంటుందనుకున్న రిజర్వాయరే వారి పాలిట శాపంగా మారింది. కడప జిల్లా ముద్దనూరు మండలం ఒంటిగారిపల్లె గ్రామ సమీపంలో వామి కొండ రిజర్వాయర్ను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకుగాను ఇది ఉపయోగపడుతుంది అనేది వారి ఆలోచన. అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అన్నట్లుగా.. ఆ రిజర్వాయరే ఇప్పుడు ఒంటిగారిపల్లె గ్రామ ప్రజలకు ముంపుగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయం పూర్తిగా నిండింది.
అవసరాలు తీర్చాల్సిన జలాశయమే.. శాపంగా మారింది
ఏ ఊరిలో జలాశయం ఉంటే.. ఆ చుట్టు పక్క ప్రాంతాల్లో ప్రజలకు తాగు, సాగు నీటికి లోటు ఉండదు. కానీ కడప జిల్లా ఒంటిగారిపల్లె గ్రామ సమీపంలో ఉన్న వామికొండ రిజర్వాయర్ అక్కడ ప్రజల పాలిట శాపంగా మారింది.
ఇళ్లలోకి వస్తున్న భూగర్భ జలాలు
భూ గర్భజలాల రూపంలో గ్రామాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరుతోంది. ఈ కారణంగా అక్కడ కొన్ని ఇళ్లు కుంగిపోతున్నాయి. రోజురోజుకు సమస్య తీవ్రం కావటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వారం కిందట జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గ్రామాన్ని పరిశీలించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు దెబ్బతింటున్నాయని, వీలైనంత త్వరగా తమ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...