అనాథలు కనిపిస్తే చాలు.. బంధువులుగా 'చేయూత'నిస్తారు. నిరాశ్రయులు ఎదురైతేచాలు అన్ని విధాలా ఆదుకుని 'బాసట'గా నిలుస్తారు. పేద విద్యార్థులని తెలిస్తే చాలు.. ఆర్థిక'అండ' అందిస్తారు. కొవిడ్ రోగులని తెలిసి అంత్యక్రియలకు బంధువులే రాకున్నా.. అన్నీ తామై సంప్రదాయంగా సంస్కారాలు నిర్వహిస్తారు. ఇన్ని కార్యక్రమాలు చేసేది వేలమందో వందమందో కాదు... కేవలం పదులమంది సహకారంతో.. పాపిజెన్ని రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ సేవలన్నీ నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
వివేకానంద ఫౌండేషన్' స్వచ్ఛంద సేవా సంస్థతో సేవలు...
కడప జిల్లా కలసపాడు మండలం తెల్లపాడుకు చెందిన రామకృష్ణారెడ్డి 11 ఏళ్లుగా... 'వివేకానంద ఫౌండేషన్' స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో సేవలందిస్తున్నారు. 60 మంది సభ్యుల సహకారంతో ముందుకు సాగుతున్నారు. రైల్వేగేట్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన.. వేతనంలో సగం మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.