శ్రీశైలంలోని మిగులు జలాలను వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కడపలో మాట్లాడుతూ.. కృష్ణ బోర్డు పలుమార్లు హెచ్చరించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాలను తరలించుకుపోవడం దారుణమని ఆయన అన్నారు. ఈరోజు సాయంత్రం శ్రీశైలం గేట్లను ఎత్తివేస్తే నీరు సముద్రం పాలవుతుందన్నారు.
కడప జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టులో చుక్క నీరు లేదని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టులలో నీటిని ఎప్పుడు నింపుతారో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సాగు జలాల్లో సీమకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మన నీటిని వాడుకుంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.