వివేకా హత్య కేసుకు సంబంధించిన రికార్డులను సీబీఐ అధికారులకు అందజేయాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో రికార్డులను తమకు ఇచ్చేలా పులివెందుల మెజిస్ట్రేట్‌ను ఆదేశించాలని కోరుతూ సీబీఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారించిన న్యాయస్థానం... ఈ మేరకు ఆదేశించింది.
వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కేసులో అనుమానితులను సీబీఐ బృందం విచారించింది. వైఎస్ వివేకా కేసును దర్యాప్తు చేసిన పోలీసులను సైతం సీబీఐ అధికారులు విచారించారు. అయితే కేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు భావించారు. రికార్డులు కావాలని కోరుతూ గతంలో పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు అంగీకరించకపోవటంతో సీబీఐ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం కేసు రికార్డులను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.