VIVEKA CASE: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు ప్రణాళిక రచన నుంచి సాక్ష్యాధారాల ధ్వంసం వరకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర అని మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. ‘తన తండ్రి హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని అప్పటి డీజీపీని సునీత కలిసినప్పుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి కళ్లు లాంటి వారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు డీజీపీ ఆమెకు వివరించారు. ఇదే విషయాన్ని ఆమె సీబీఐకి ఇచ్చిన 164 వాంగ్మూలంలో పేర్కొన్నారు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రస్తుత అధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అధికార యంత్రాంగమంతా ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోంది. పోలీసుల సహకారం లేకుండా దర్యాప్తు తుది దశకు చేరడం సాధ్యం కాదు. దిగువ కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు శివశంకర్‌రెడ్డికి బెయిలు మంజూరు చేయవద్దు. బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పిటిషన్‌ను కొట్టేయాలని...’ ఆయన కోరారు.
సోమవారం జరిగిన విచారణలో వివేకానందరెడ్డి కుమార్తె సునీత తరఫు వాదనలు, శివశంకర్‌రెడ్డి తరఫు తిరుగు సమాధానం వాదనలు ముగిశాయి. ఇతర నిందితుల వాదనల కోసం విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు వై.సునీల్ యాదవ్(ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి(ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(ఏ5) బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘దస్తగిరి వాంగ్మూలం తప్ప పిటిషనర్‌కు ఈ హత్య ఘటనలో పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆయనపై కేవలం 5 కేసులే పెండింగ్‌లో ఉన్నాయి. గత ఆరున్నర నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయనపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసిన నేపథ్యంలో బెయిలుకు అర్హుడు. ఏపీలో కాకుండా ఏ రాష్ట్రంలోనైనా ఉండేలా షరతు విధించి బెయిలు ఇవ్వండి...’ అని కోరారు.