కరోనా కష్టకాలంలో ఆగిపోయిన ప్రగతిరథాలను ముందుకు నడిపించడానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రత్యేక పథక రచన చేసింది. జిల్లాలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఈ తరుణంలో రవాణా వ్యవస్థను పూర్తిగా నిషేధించారు. రైతులు పండించిన వాణిజ్య పంటల ఉత్పత్తులు, కూరగాయలను తరలించేందుకు ఆర్టీసీకి చెందిన సరకు రవాణా వాహనాల (డీజీటీ)ను తక్కువ అద్దెకే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కడప డిపో మేనేజరు నిరంజన్ ప్రకటించారు.
వ్యవసాయోత్పత్తులను వీటి సాయంతో ఎగుమతి- దిగుమతి వేగంగా సాగించవచ్చని వివరించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి రావడానికి అనుమతి ఉందన్నారు. డీజీటీలు వద్దునుకున్న వారికి బస్సులనూ ఇదే తరహా అవసరాలకు అద్దెకు ఇస్తామని, సరకులు అమర్చుకోవడానికి సీట్లనూ తొలగిస్తామని చెప్పారు. గతం కన్నా తక్కువ అద్దె ఉంటుందన్నారు.