కడప జిల్లా రాయచోటి పురపాలిక కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మల్లికార్జున.. తన విధులు నిర్వహిస్తూనే, విరామ సమయంలో కరోనా బాధితులకు సాయపడుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడిన ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచి, వారిలో మనోధైర్యం నింపుతున్నారు. బాధితులకి వైద్యం అందిస్తూ, కొవిడ్ కేంద్రాల్లో చేర్పిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు నిర్ధరణ పరీక్షలు చేయించి, ప్రభుత్వపరమైన సేవలను అందిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఆహారం తయారుచేసి అనాథలకు పంపిణీ చేశారు. మల్లికార్జున సేవలకు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.
కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు
కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులే ముందుకు రావడంలేదు. అలాంటిది మల్లికార్జున ఆ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. రాయచోటిలోని ఓ మసీదులో బీహార్ కు చెందిన మౌజన్ కరోనాతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని తాకేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మల్లికార్జున.. ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఉప తహసీల్దార్ కరోనాతో బాధపడుతూ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలుసుకున్న మల్లికార్జున ఆయన ఇంటికి వెళ్లి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దురదృష్టవశాత్తు ఉప తహసీల్దార్ ప్రాణాలు కోల్పోయారు. బంధువులు ఎవరు అంత్యక్రియలు చేసేందుకు రాకపోతే మల్లికార్జున అధికారుల సాయంతో అంత్యక్రియలు పూర్తి చేయించారు.