వైఎస్ఆర్ చిత్రపటం లేదని విద్యార్థుల ఆందోళన - students
విశ్వవిద్యాలయ వార్షికోత్సవంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. వేదికపై బైఠాయించి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. చివరికి వైఎస్ఆర్ ఫోటోను అధికారులు ఏర్పాటు చేసినందున విద్యార్థులు శాంతించారు. ఈ ఘటన కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది.
కడప యోగి వేమన విశ్వవిద్యాలయ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు యోగివేమన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. దాని పక్కనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి చిత్రపటాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ విద్యార్థి సంఘ నాయకులు సమావేశం జరుగుతుండగా ఉపకులపతి రామచంద్రారెడ్డి వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. వైఎస్ఆర్ చిత్రపటం ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తూ వేదికపైనే బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పిన వినలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారినందున.. ఎట్టకేలకు అధికారులు వై.యస్ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాల వేశారు.