15 రోజులుగా రాని నీళ్లు... 50 కుటుంబాలకు ఇక్కట్లు
రెండు రోజులకోసారి వచ్చే వాటర్ ట్యాంకర్ వారికి తాగునీటికి ఆధారం. అది కూడా 15 రోజుల నుంచి రావటం లేదు. పైప్లైన్ మరమ్మతు చేస్తే మున్సిపాలిటీ నీరు వస్తుంది. కానీ అధికారులు పట్టించుకోవటం లేదు.
గుక్కెడు తాగు నీటి కోసం ఆ ప్రాంత ప్రజలు తల్లడిల్లుతున్నారు. తాగునీటికి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నప్పటికీ 15 రోజులుగా అవీ రావటం లేదు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బాలాజీ నగర్లో నెలకొంది ఈ దుస్థితి. పురపాలక నుంచి రెండు రోజులకు ఓసారి వచ్చే ట్యాంకర్, ఓ పార్టీ నాయకుడు పంపించే ట్యాంకర్ నీటితో కాలనీవాసులు కాలం వెళ్లదీస్తున్నారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. అప్పుడు అధికారులు పైప్లైన్కు మరమ్మతులు చేపట్టాక సమస్య తీరింది. ప్రస్తుతం మళ్లీ అదే సమస్య తలెత్తింది. సుమారు 50 కుటుంబాల ప్రజలు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పురపాలక అధికారులకి చెప్పినా స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందెలతో నీటిని మూడు అంతస్థులకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు. తమ సమస్యను తీర్చాలని బాలాజీ నగర్ ప్రజలు స్థానిక నేతలకు ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు.