కడప జిల్లాలో వేల కోట్ల రూపాయలు సంపాందించిన నాయకులు వారి స్వార్థం కోసం ప్రజలను బానిసలుగా చూస్తున్నారని...రాయలసీమను రతనాలసీమగా మార్చడానికే జనసేన పుట్టుకొచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. తనను కడపలో అడుగు పెట్టనివ్వమని కొందరు వ్యక్తులు మాట్లాడారని...తనను నిలువరించే దమ్ము ఆ నాయకులకు ఉందా.. అని ప్రశ్నించారు. కడప జిల్లాలో రెండు రోజుల పర్యటన సందర్భంగా కర్నూలు నుంచి కడప జిల్లాకు వచ్చిన పవన్ కల్యాణ్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట, కడప నగరంలో పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించారు. కడపలోని అన్నమయ్య కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో పవన్ ఆవేశ పూరితంగా ప్రసంగించారు.
ఐదేళ్లపాటు 50 లక్షల బీమా..
ప్రజలను భయపెట్టేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడని...ప్రజల రక్షణ కోరుకునే వాడే నిజమైన నాయకుడని పవన్ కల్యాణ్ అన్నారు. తనకు కులం అంటే ఇష్టం లేదని... అన్ని కులాల వారిని ప్రేమించే వారి బాగోగుల కోసమే వచ్చానన్నారు. ఇప్పటికే తమ మేనిఫెస్టోలో అనేక పథకాలు రూపొందించామని...అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఐదేళ్ల పాటు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
స్వేచ్ఛనిచ్చేవాడే నాయకుడు
రాయలసీమలో రౌడీయిజం, ప్రైవేటు సైన్యంతో ప్రజలను భయపెట్టి పాలించే రోజులకు కాలం చెల్లిందని...ప్రజలు మార్పు కోసం పరితపిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలను భయపట్టే నాయకుల కోటలను కడప గడ్డ నుంచే జనసేన బద్ధలు కొడుతుందని వ్యాఖ్యానించారు.
కడప జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
జనసేన అధినేత కడప జిల్లా పర్యటనగురువారం రెండో రోజు సాగనుంది. ఉదయం కడపలో విద్యార్థులతో ముఖాముఖీలో పాల్గొంటారు. అనంతరం రాజంపేట, కోడూరులో రోడ్ షో నిర్వహించి చిత్తూరు పర్యటనకు బయలుదేరి వెళ్తారు.