ఇతను మోసం చేయడంలో దిట్ట. అంత ఇంత కాదు..ఏకంగా సుమారు 200మంది యువతులు, వందమంది మహిళలను మోసం చేశాడు. వారితో ప్రేమగా మాట్లాడి..వాళ్లకి తెలీకుండానే అర్థనగ్న చిత్రాలు తీసుకున్నాడు. ఇంకా అవే అస్త్రాలుగా మలిచి...బెదిరించి బంగారం, నగదు తీసుకున్నాడు. ఏం చేయాలో తెలియని బాధితులు అడిగింది ఇచ్చేవారు. వాళ్లేవరూ ఫిర్యాదు చేయకపోయిన..... ఓ వ్యక్తి ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడని కేసుపెడితే ఈ వ్యవహారం బయటికి వచ్చింది. పోలీసులు..అతని మోసాలు చూసి అవాక్కయ్యారు.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంత్‌రెడ్డి అలియాస్ రాజారెడ్డి అలియాస్ టోనీ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలోనే చదువు మానేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. 2017లో గొలుసు చోరీలు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. జైలుకు వెళ్లి బెయిలుపై బయటికి వచ్చాడు. ఇతడికి షేర్‌చాట్ ద్వారా శ్రీనివాస్ అనే వ్యక్తితో 2020లో పరిచయమైంది. తన పేరు ప్రశాంత్‌రెడ్డి అని, హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్నానని, అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్‌కు ఆశ చూపాడు. తన తల్లి వైద్యం కోసమని డబ్బులు అడిగాడు. శ్రీనివాస్ తన తల్లి మెడలోని బంగారు గొలుసు తీసుకెళ్లి ఇచ్చాడు. తర్వాత శ్రీనివాస్ ఎన్నిసార్లు ఫోన్‌చేసినా స్పందించలేదు. జులై 29న ఓ చోరీ కేసులో ప్రసన్నకుమార్‌ను అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.