TDP Leaders Counter to Avinash Reddy: తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని అధికార పార్టీపై లోకేశ్ అబద్దాలు, అసత్యాలు పలుకుతున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గుర్తుకురాని లోకేశ్‌కు.. ఇప్పుడు రాయలసీమ గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. కడపలో 5కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి భూమి పూజ చేశారు. లోకేశ్ పాదయాత్ర కేవలం వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శించడానికి చేస్తున్నారని ఆరోపించారు. ఏ మాత్రం అవగాహన, చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. లోకేశ్ రాయలసీమ ప్రాంత వాసి అని ఇప్పుడే ఆయనకు గుర్తు వచ్చినట్లు ఉందని అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు.
అన్న వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కడపలోని పార్టీ కార్యాలయంలో శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అవినాష్‌పై ఆరోపణలు చేశాడు. రాయలసీమ మూడు జిల్లాలతో పోలిస్తే కడప జిల్లాలో యువగళానికి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్రకు, సభలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఎంపీ అవినాష్ రెడ్డి లోకేశ్‌పై ఆరోపణలు చేశారని శ్రీనివాస రెడ్డి వెల్లడిచారు.
13 ఈడీ కేసులు కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి సోదరుడు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ఎలాంటి మచ్చలేని లోకేశ్‌ను విమర్శించడం తగదని శ్రీనివాస రెడ్డి హితవు పలికారు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గత ఆరు నెలల నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టు సీబీఐ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడని.. అలాంటి వ్యక్తి కూడా టీడీపీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారనే.. ఆ విమర్శలను ఓర్వలేకనే లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాస రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో యువగళం పూర్తయిందని మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. యువగళానికి సహాయ సహకారాలు అందించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా కలిసి కడప జిల్లాలో యువగళాన్ని విజయవంతం చేశారని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
నారా లోకేశ్ పై ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఖండించిన టీడీపీ నేతలు 'తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని... అధికార పార్టీపై నారా లోకేశ్ అబద్దాలు, అసత్యాలు పలుకుతున్నారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని రాయలసీమ ఇప్పుడెలా గుర్తొచ్చింది. రాయలసీమపై ఏమాత్రం చిత్తశుద్ధి అవగాహన లేకుండా లోకేశ్ మాట్లాడుతున్నారు. లోకేశ్ పాదయాత్ర కేవలం వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శించేందుకే చేస్తున్నారు. లోకేశ్‌కు తాను రాయలసీమ ప్రాంత వాసి అని ఇప్పుడే గుర్తొచ్చినట్టుందా?'-అవినాష్ రెడ్డి, కడప ఎంపీ
'కడప జిల్లాలో యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేకనే అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అన్న వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి లోకేశ్‌పై ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. 13 ఈడీ కేసులు కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి సోదరుడు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ఎలాంటి మచ్చలేని లోకేశ్‌ను విమర్శించడం తగదు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గత ఆరు నెలల నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టు సీబీఐ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.'- శ్రీనివాస రెడ్డి, టీడీపీ నేత