కరోనా నివారణ చర్యలు, బాధితులకు వైద్యసేవలు అందించడంలో జగనన్న ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని అనంతరాజుపేట హార్టికల్చర్ కాలేజ్‌లోని కొవిడ్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొవిడ్ రోగులతో కలివిడిగా మాట్లాడి ధైర్యం చెప్పిన ఆయన.. బాధితులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై ఆరా తీశారు.
అనంతరం రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే వైరస్ బాధితులకు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు. సమిష్టి కృషితో కరోనాకు అడ్డుకట్ట వేద్దాం.. ప్రతి ఒక్కరూ వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా మరో రెండు రోజుల్లో 35 బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా కర్ఫ్యూ అమలు చేస్తున్న తీరుపై పోలీసులతో మాడ్లాడి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు, మండలం నాయకులు పాల్గొన్నారు.