కడప పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఉదాహరణ ఇచ్చారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న ఓ యువతికి సాయం అందించారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన బిగాలు ఖంబలాయ్ (21) అనే యువతి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది. జిల్లాలోని రాపూరుకు చెందిన శ్రావణి ఆమె స్నేహితురాలు. లాక్డౌన్ ప్రకటించడానికి ముందు సెలవు రోజులో కడప జిల్లా చిట్వేలులోని తమ బంధువుల ఇంటికి ఆట విడుపుగా బిగాలు ఖంబలాయ్ను తీసుకువచ్చింది శ్రావణి. అదే సమయంలో లాక్డౌన్ ప్రకటించటంతో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యువతి అటు రాష్ట్రానికి గానీ...కళాశాలకు గానీ వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలి బంధువుల ఇంటిలో వసతి, భోజనం విషయంలో ఇబ్బందిగా మారటంతో యువతి ఆవేదనకు గురైంది.
అరుణాచల్‌ప్రదేశ్ యువతికి కడప పోలీసులు సాయం
అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువతికి కడప పోలీసులు సాయం చేశారు. లాక్డౌన్ కారణంగా స్నేహితురాలి ఇంట్లో చిక్కుకుపోయిన ఆమెకు మంచి వసతి సౌకర్యాన్ని కల్పించారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ చొరవతో అధికారులు ఆమె ఇబ్బందిని తొలగించారు.
బిగాలు ఖంబలాయ్ విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసు సిబ్బంది.... జిల్లా ఎస్పీ అన్బురాజన్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎస్పీ...యువతికి అవసరమైన ఇల్లు, భోజన వసతి ఏర్పాటు చేయాలని రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డిని ఆదేశించారు. వెంటనే చిట్వేలు పట్టణంలో యువతి ఉండేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన ప్రైవేట్ ఇల్లు ఇప్పించారు. తన సమస్యను పరిష్కరించిన కడప జిల్లా ఎస్పీకి యువతి కృతజ్ఞతలు తెలిపింది. మానవతా దృక్పథంతో ఎస్పీ చేసిన సాయం మరువలేనని చెప్పింది.
ఇదీ చదవండి