ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్యధికం సమస్యాత్మకం.. సంగ్రామం ప్రశ్నార్థకం

కడప జిల్లాలో స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు దృష్టి సారించారు. పోలీంగ్ కేంద్రాల వారీగా భద్రతా పర్వవేక్షణ చర్యలు చేపట్టారు. జిల్లాలో ఉన్న మెుత్తం పోలీంగ్ కేంద్రాల్లో 5,389 సమస్యాత్మకం, 940 అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

By

Published : Feb 1, 2021, 1:57 PM IST

kadapa problematic Panchayati's
కడప స్థానిక సమరం

పోలింగ్ కేంద్రాల సమాచారం

పల్లెపోరు కాక పుట్టిస్తోంది. స్థానిక సమరానికి నేతలు, ఆశావహ అభ్యర్థులు సై అంటున్నారు. గెలుపే లక్ష్యంగా నాయకులు వ్యూహం రచిస్తున్నారు. మరోవైపు సంగ్రామం సజావుగా సాగేలా జిల్లా యంత్రాంగం అప్రమత్తమవుతోంది. గతంలో ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక సంఘటనలపై క్షేత్రస్థాయి నుంచి జిల్లా అధికారులు సమాచారాన్ని తెప్పించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, తాజా పరిస్థితులను బేరీజు వేసుకొని ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో సాధారణ విభాగంలో 20 శాతం లోపే ఉన్నాయి. సమస్యాత్మకం 68.19 శాతం ఉండగా, అతి సమస్యాత్మక కేంద్రాలు 11.90 శాతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు.

పోలింగ్ కేంద్రాల సమచారం

ఇది ఒంటిమిట్ట గ్రామం ముఖచిత్రం. గత ఎన్నికల్లో జరిగిన ఘర్షణలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు 12 వార్డులను అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల జాబితాలోకి చేర్చారు. జిల్లాలో కడప, జమ్మలమడుగు, రాజంపేట డివిజన్ల పరిధిలో 50 మండలాలు ఉన్నాయి. 807 గ్రామ పంచాయతీల్లో 7,904 వార్డులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. న్యాయపరమైన చిక్కులు రావడంతో 14 పంచాయతీల్లో పల్లెపోరు ఆపేశారు. మూడు డివిజన్లలో నాలుగు దశల్లో 368 క్లస్టర్లు, 793 పంచాయతీల్లో ఉన్న 7,762 వార్డులకు ఎన్నికల క్రతువు జరుగుతోంది. ఇందుకోసం 7,903 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం ఏం వసతులు ఉన్నాయి.. ఇంకా ఏమేమి కల్పించాలో ఆరా తీస్తున్నారు. ఎలాంటి రాజకీయ సమస్యల్లేని సాధారణ పోలింగ్‌ కేంద్రాలు 1,574 (19.91 శాతం) ఉన్నట్లు నిర్ధారించారు.

గతేడాది మార్చిలో మండల, జిల్లా పరిషత్తులకు ఎన్నికలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 554 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా 415, తెదేపా ఆరు, ఇతరులు మూడింట్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 50 జడ్పీటీసీ స్థానాల్లో 38 ఏకగ్రీవమయ్యాయి. ఈలోపు కొవిడ్‌ ప్రభావంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పరిషత్తు పోరును వాయిదా వేశారు. ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాల పరిధిలోని పంచాయతీలను సమస్యాత్మక ప్రాంతాలుగా పరిగణనలోకి తీసుకోవాలని ఎస్‌ఈసీ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సమస్యాత్మక కేంద్రాలు, గొడవలు జరిగేందుకు ఆస్కారమున్న ప్రాంతాల వివరాలను తాజాగా గుర్తించి నివేదించారు.

ప్రత్యేక బందోబస్తు

సున్నిత, అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాలపై జిల్లా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో ఉన్న వివాదాస్పద వ్యక్తులు, రౌడీషీటర్లు, తీవ్రమైన నేరాలు చేసిన వారిని, గొడవలకు దిగే వారిని గుర్తించారు. ఇప్పటికే వారిని బైండోవర్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు క్షేత్రస్థాయిలో అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నారు. గతంలో కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. నిరుడు ఒంటిమిట్ట ఎంపీటీసీ స్థానానికి తెదేపా తరపున నామినేషన్‌ వేయడానికి వచ్చిన ఓ అభ్యర్థి చేతిలోని నామపత్రాలను వైపాకా మద్దతుదారులు లాక్కొని చించివేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఘటనలెన్నో చోటుచేసుకున్నాయి. ఈసారి ఎస్‌ఈసీ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారన్నది చర్చనీయాంశంగా మారింది.

పెద్దనాగిరెడ్డి ప్రత్యేకత

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పెద్దనాన్న శెట్టిపల్లె పెద్ద నాగిరెడ్ఢి చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన పెద్దనాగిరెడ్డి 18వ ఏటనే అఖిల భారత కాంగ్రెస్‌ సభ్యుడిగా సేవలందించారు. ప్రొద్దుటూరు తాలూకా కాంగ్రెస్‌ సభ్యుడిగా, తాలూకా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, జిల్లా సభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్‌ సభ్యుడిగా వ్యవహరించారు. ప్రొద్దుటూరు పరిధిలోని ఓబాయపల్లి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1959లో మైదుకూరు పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1972లో జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మద్యపాన నిషేధ సవరణ బిల్లుపై నియమించిన సెలక్టు కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేశారు. కొత్తమాధరం పంచాయతీలో 12 వార్డులు ఉన్నాయి. తాజాగా వీటిలోని 11 వార్డులను అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

ఇదీ చదవండి:

పులివెందుల ఆర్టీసీ డిపో ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ

ABOUT THE AUTHOR

...view details