అల్పపీడన ప్రభావంతో కడప జిల్లావ్యాప్తంగా వర్షాలు(kadapa district rains) కురుస్తున్నాయి. వర్షాల వల్ల కడప నగరమంతా జలమయమైంది. రోడ్లపై మోకాలి లోతు వరకు వరద నీరు నిలిచిపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బుగ్గవంక ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగటంతో 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎస్ఆర్ నగర్‌లో నడుము లోతు వరకు నీరు నిల్వ ఉండటంతో అత్యవసరాల కోసం కొందరు ఏకంగా బోట్లను ఆశ్రయిస్తున్నారు. నీటి క్యాన్లతో బోటును తయారు చేసుకుని వినియోగిస్తున్నారు. ఊటుకూరు చెరువు అలుగు పారడంతో.. విజయనగర్ కాలనీలోకి వరద నీరు పోటెత్తుతోంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో వాటిని ఎత్తి పోసేందుకు ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.
నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, భరత్ నగర్, అంబేడ్కర్ కూడలి, భాగ్య నగర్ కాలనీ, గంజికుంట కాలనీ, మృత్యుంజయ కుంట, ప్రకాష్ నగర్, నకాష్ వీధి, శాస్త్రి నగర్, ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం రోడ్డు, కోర్టు రోడ్డు, నీటమునిగాయి. పలు వాగులు, వంకలు, చెరువులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి.
సిద్ధవటం మండలంలోని ఎస్సీ కాలనీ చుట్టూ వరద నీరు చుట్టుముట్టింది. కడప శివారులోని పాలెం పల్లె వద్ద వాగులో ఎద్దుల బండి కొట్టుకొని పోవడంతో రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. జిల్లా మొత్తం భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
పాఠశాలలకు సెలవు..
బుగ్గవంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వాగులు, వంకలు, నదుల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా నేడు, రేపు జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే పరీక్షలను వాయిదా వేశారు.