కడప జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలకు సంబంధించి జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై కలెక్టరేట్ లో మంత్రి ఆళ్లనాని సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, వైకాపా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హరికిరణ్ సమక్షంలో జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. జిల్లాలోని కొవిడ్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ వ్యక్తులతో మంత్రి ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలు, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు.
కొవిడ్ నివారణ కోసం ఎంతైనా ఖర్చుచేసేందుకు సిద్ధం: ఆళ్ల నాని - కడప కొవిడ్ కేసులు న్యూస్
రాష్ట్రంలో కొవిడ్ నివారణ కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా అత్యధిక కరోనా పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనన్న మంత్రి ఆళ్లనాని... వారికి కావాల్సిన ఆసుపత్రులు, మందులు, వైద్య సదుపాయాలు సమకూరుస్తున్నామని చెప్పారు. కడప జిల్లాలో రోజుకు సగటున 4 వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న మంత్రి... జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1080 ఆక్సిజన్ బెడ్లకు అదనంగా మరో 300 బెడ్లు పెంచుతున్నామన్నారు. వారం రోజుల్లో జిల్లా కొవిడ్ కేర్ ఆసుపత్రుల్లో పని చేయడానికి కావాల్సిన వెయ్యిమంది వైద్యులు, నర్సులు, సిబ్బందిని నియమిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. పాజిటివ్ వచ్చినవారు భయపడొద్దని... ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆళ్ల నాని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ విచారణ