వరద నీరు రావడం ఒక ఎత్తయితే, నివాసాలు, దుకాణాల్లో అడుగు ఎత్తు వరకు చేరిన బురద, తడిసిపోయిన ఇంటి, దుకాణ సామగ్రిని బయటపడేయడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. కాస్తో...కూస్తో ఆర్థికస్తోమత ఉన్నవారు డబ్బులు వెచ్చించి ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. పేదలు తమ ఇళ్లను తామే బాగుచేసుకునేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. వ్యాపారులైతే తమ వ్యాపారాలు మానుకుని తమకు అన్నం పెట్టే దుకాణాలను తిరిగి యథాస్థితికి తీసుకొచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నారు. నాలుగు రోజులుగా ఇళ్లు, దుకాణాల ముందు, వీధుల్లో టన్నుల కొద్దీ చెత్తాచెదారం పేరుకుపోవడమే కాకుండా చిత్తడిగా మారడంతో దుర్వాసనతో బాధితులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని, యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వారంతా కోరుతున్నారు. తమకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, జరిగిన నష్టంతో నిండా మునిగిపోయామని, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కన్నీళ్లపర్యంతమవుతున్నారు.
బాధితులకు రూ.500 చొప్పున పరిహారం : కలెక్టర్
జిల్లాపై మరో తుపాను ప్రభావం విషయమై కేంద్ర విపత్తు నిర్వహణశాఖ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తాజా అనుభవాల దృష్ట్యా ఒకవేళ తుపాను ప్రభావం చూపినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 'నివర్ ప్రభావంతో నష్ట పోయిన రైతుల వివరాలపై డిసెంబరు 15వ తేదీలోగా పూర్తి వివరాలు సేకరిస్తాం. పింఛా జలాశయ మట్టి కట్ట తాత్కాలిక మరమ్మతులకు రూ.2 కోట్లు అవసరమవుతుంది. నివర్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు చాలా ఇళ్లు ముంపునకు గురయ్యాయి. జిల్లావ్యాప్తంగా 15 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం. వీళ్లందరికీ ప్రభుత్వం రూ.500 పరిహారం అందించనుంది. ప్రధానంగా బుగ్గవంక వరద ఉద్ధృతికి కడప నగరంలోని పలు ప్రాంతాల్లోని వేల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుగ్గవంక వరద బాధితులకు రూ.500 చొప్పున అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చాలామంది పునరావాస కేంద్రాలకు రాకపోయినా వారికి కూడా డబ్బులందిస్తాం. పసిపిల్లలకు సైతం నష్టపరిహారం పంపిణీ చేస్తాం. ఇందుకోసం బాధితుల వివరాల సేకరణ కొలిక్కి వచ్చింది. బుగ్గవంక వరదలు మరోసారి కడప నగరాన్ని ముంచెత్తకుండా వెంటనే రక్షణ గోడల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తాం. ఆమోదం వచ్చిన వెంటనే పనులు చేపట్టి తప్పకుండా పూర్తిచేస్తాం' అని కలెక్టర్ వివరించారు.