మొన్నటిదాకా కరోనా కంటకమే లేదని పొంగిపోయిన సిమెంటు పరిశ్రమల పురం.. ఎర్రగుంట్ల గుండెల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. వరుసపెట్టి వైరస్ పాజిటివ్ కేసులు దాఖలవుతున్న తీరు హడలెత్తిస్తోంది. పొరుగునున్న పసిడిపురి నుంచి ఇక్కడికి సోకిన తొలి బాధితుల నుంచే మరో ముగ్గురికి తాజాగా వైరస్ అంటుకోవడంతో యంత్రాంగం మొత్తం అప్రమత్తమై నాలుగు రోడ్ల కూడలిని దిగ్బంధించారు. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జనం వీధుల్లోకి రావడమే మానేశారు. వెసులుబాటు సమయంలో వెలుపలికి వచ్చేవారూ.. గడప దాటడానికి వెనకడుగు వేస్తున్నారు. సామాజికదూరం, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల సంరక్షణమినహా.. ప్రస్తుత పరిస్థితిని అధిగమించలేమని వైద్యాధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎర్రగుంట్లలో ఇప్పటికి తొమ్మిది కేసులు నమోదుకాగా.. అవన్నీ నగర పంచాయతీ పరిధిలోని దొండపాడు రోడ్డు, ఏరువాక గంగమ్మ ఆలయ పరిసరాల్లోనే కావడం ప్రస్తావనార్హం.
పసిడిపురి.. విలవిల
ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉన్నాయి. జిల్లా అంతటా 58 మందికి వైరస్ సోకితే.. ఒక్క ప్రొద్దుటూరులోనే 25 మంది మగ్గిపోతున్నారు. ఇందులో 11 మంది వ్యాధి నుంచి కోలుకోవడం కొంతలో కొంత మేలనిపించినా.. మిగతా 14 మంది ఒడ్డునపడితేనే సాంత్వన. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఒక్క కేసూ ఇక్కడ నమోదు కాలేదు. ప్రొద్దుటూరు- ఎర్రగుంట్ల అనుసంధానంగా వైరస్ పెరగడమే ఆందోళనకరం. మొదట దిల్లీ వెళ్లి వచ్చిన వారి నుంచి వైరస్ అడుగుపెట్టింది. మొదట్లో ఏడుగురికి సోకింది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు, ఇప్పుడు పక్కవారికి, పక్క వీధులకు పాకింది. ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్, ఆంధ్రకేసరిరోడ్డు, నడింపల్లె, జేమ్స్‌పేట, పెన్నానగర్, మట్టిమసీద్ వీధీ, ఖాదర్‌హుస్సేన్ మసీద్ వీధీ, జోక్‌పాళెం, వసంతపేట వేమానగర్, కోటవీధీని తాకి.. పసిడిపురిని కన్నీరు పెట్టిస్తోంది. జనమంతా స్వీయ నిర్బంధాన్ని స్వచ్ఛందగా పాటిస్తున్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఎంత ఆలస్యమైతే అంతా వేగంగా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.