తలనీలాలు సమర్పించేందుకు కడప జిల్లా మైదుకూరులోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలసిన భైరవకోనకు వెళ్లిన సుమారు 30మందిని పోలీసులు రక్షించారు. భారీ వర్షం కారణంగా వారంతా అటవీ ప్రాంతంలో చిక్కుకున్నారు. జిల్లాలోని ఖాజీపేట మండలం అగ్రహారానికి చెందిన లక్ష్మీ, ప్రశాంత్ దంపతులు పిల్లల తలనీలాలు సమర్పించేందుకు రెండు ట్రాక్టర్లలో వారి బంధువులు దాదాపు 30 మందితో కలిసి భైరవకోనకు వెళ్లి... తిరుగు ప్రయాణమయ్యారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భైరవకోన వద్ద ఉన్న వాగు పొంగి భారీగా ప్రవహించిన కారణంగా ముందుకు వెళ్లలేకపోయారు. 24 గంటల్లో ఇంటికి చేరాల్సిన వారు తిరిగి రాకపోయేసరికి ఆందోళనకు గురైన వారి కుటుంబసభ్యులు... పోలీసులకు సమాచారం అందించారు. మైదుకూరు అర్బన్ సీఐ మధుసూదన్ తన సిబ్బందితో పాటు ముదిరెడ్డిపల్లె తండా వాసుల సహాయంతో వాగు వద్ద వారిని కలుసుకున్నారు. తాళ్ల సహాయంతో వాగు దాటించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.