నాడు-నేడు పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడరాదని.. ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ కడపలో ఈ పథకం కింద చేపట్టిన పాఠశాలలు, వాటిలో 9 రకాల మౌలిక సదుపాయాల కల్పన, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాలు తదితరాలను.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని జయనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, వల్లూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల మెయిన్, కమలాపురంలోని రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లలో జరుగుతున్న పనులు పరిశీలించారు.
పాఠశాలల్లోని తరగతి గదులు, ఫ్లోరింగ్, గోడలకు వేసిన పెయింటింగ్, బల్లలు, బోర్డులు, పిల్లలకు సరఫరా చేసిన బ్యాగులు, బట్టలు నాణ్యత, విద్యుత్ సౌకర్యం, స్విచ్ బోర్డులు, వంట గది, మరుగుదొడ్డి, ఆట వస్తువులు, ప్రహరీ గోడ నిర్మాణం తదితర పనుల నాణ్యతను సాల్మన్ పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో పాటు సభ్యులందరూ ఏయే పనులు పర్యవేక్షించారు? సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నరు. సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.