కడప జిల్లా కొప్పర్తి మెగా పారిశ్రామికవాడలో ఈఎంసీ నెలకొల్పాలన్న సీఎం జగన్ నిర్ణయానికి అనుగుణంగా... దాదాపు 7 వేల ఎకరాలను ఏపీఐఐసీ సేకరించింది. పర్యావరణ, అటవీ అనుమతులు పొందిన 15 వందల ఎకరాలు... పరిశ్రమలు పెట్టాలనుకునే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం సిద్ధంగా ఉంది. దీంట్లో 800 ఎకరాలను ఈఎంసీ కోసం కేటాయించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో రెండు ఈఎంసీలు ఉండగా... కొప్పర్తిలో మూడో క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 730 కోట్ల రూపాయల వ్యయంతో... వచ్చే 6 నెలల నుంచి ఏడాదిలోగా దీని పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. 730 కోట్ల రూపాయలతో వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలోగా ఈఎంసీ-3 పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనులు ప్రారంభించారు.
క్లస్టర్ నిర్మాణ ఖర్చుల్లో 70 శాతాన్ని కేంద్రం భరించనుండగా... మిగిలిన 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ భరిస్తాయి. 800 ఎకరాల్లో పలు ఎలక్ట్రానిక్స్ సంస్థలు పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు... ఆధునికమైన భారీ షెడ్లను ఏపీఐఐసీ ఏర్పాటు చేయనుంది. రహదారులు, నీటివసతి, మౌలికవసతుల కల్పనకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. డిజైన్ రూపకల్పనకు ఓ ప్రైవేటు సంస్థకు సంప్రదింపుల బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. ఆరు నుంచి పది భారీ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలు నెలకొల్పే విధంగా లేఅవుట్ సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు.