మళ్లీ అధికారమిస్తే రాయచోటి రూపురేఖలు మారుస్తాం
తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తే.. రాయచోటి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాక భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ తీసుకొస్తామన్నారు రెడ్డప్పగారి రమేశ్ కుమార్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లా రాయచోటి నియోజవర్గంలో ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధిని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్పగారి రమేశ్ కుమార్ రెడ్డి వివరించారు. 180 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. నియోజవర్గంలోని 5 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు వెలిగల్లు, జరికోన ప్రాజెక్టులతోపాటు మండపల్లి రిజర్వాయర్ కింద కాలువల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. రాయచోటిలో అత్యధికంగా ఉన్న మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలతో చెరువులు, కుంటలు, నదుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని... రాబోయే వర్షాకాలంలో వీటిల్లో హంద్రీనీవా నీటిని నింపి కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తే.. రాయచోటి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాక భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయిదేళ్లుగా జరిగిన అభివృద్ధిని చూసి తెదేపాకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.