ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం పనుల్లో అవినీతి నిజమే..: నిపుణుల కమిటీ

పోలవరం కుడి, ఎడమ కాలువ పనుల్లో.. అక్రమాలు చోటుచేసుకున్నాయని నిపుణుల కమిటీ తేల్చింది. ఈపీసీ నిబంధనలను పూర్తిస్థాయిలో ఉల్లంఘించారని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. వివిధ ప్యాకేజీల్లో గుత్తేదారులకు ప్రయోజనం కలిగేలా ధరలు పెంచేశారని తెలిపింది. రివర్స్‌ టెండర్‌కు వెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది.

By

Published : Jul 25, 2019, 6:54 AM IST

Updated : Jul 25, 2019, 7:08 AM IST

పోలవరం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ పనులకు వ్యయాన్ని భారీగా పెంచేశారని ఆరోపిస్తూ వీటిని తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించింది. పోలవరం కుడి, ఎడమ కాలువ పనుల్లోనూ ఈపీసీ నిబంధనల్ని పూర్తిస్థాయిలో ఉల్లంఘించారని నిపుణుల కమిటీ తేల్చింది. వివిధ ప్యాకేజీల్లో గుత్తేదారులుకు లాభం కలిగేలా చర్యలు తీసుకున్నారని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా మట్టి పని పరిమాణాలను పెంచేశారని స్పష్టం చేసింది. జలవనరుల శాఖ నాణ్యత నియంత్రణ విభాగం సరిగా పనిచేయడం లేదని పరిశీలనలో వెల్లడైందని కమిటీ తెలిపింది. గుత్తేదారులు సకాలంలో పనులు చేయకున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని కమిటీ తప్పుపట్టింది. పనులపై రివర్స్‌ టెండర్లకు వెళ్లాలని సిఫారసు చేసింది.

రివర్స్ టెండరింగ్​కు సూచన

పోలవరం ప్రాజెక్టులో ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌ ఆర్థిక సమస్యలతో నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు ఆశ్రయించిన తరుణంలో వారితో ఒప్పందం రద్దు చేసుకుని కొత్తగా టెండర్లు పిలవాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రధాన డ్యాం, విద్యుత్‌ కేంద్రం పనులు విషయంలో ప్రస్తుత గుత్తేదారుతో పనులు కొనసాగించాలా లేదా అన్న విషయంలో న్యాయపరమైన సలహా తీసుకోవాలని సూచించింది. ప్రధాన డ్యాం, విద్యుత్‌ కేంద్రం పనుల్లో మిగిలి ఉన్న వాటిని గుర్తించి రెండింటినీ కలిపి సింగల్‌ బిడ్‌గా టెండర్లు పిలవాలని సలహా ఇచ్చింది.

ఎడమ కాలువ పనుల్లో అక్రమాలు

పోలవరం ఎడమ కాలువ పనుల్లో గుత్తేదారులు పనులు సరిగా చేయకపోయినా వారితో కుదుర్చుకున్న ఒ్పపందానికి భిన్నంగా ధరలు పెంచేశారని నిపుణుల కమిటీ నివేదించింది. ఒక్క ఎడమ కాలువలోని 8 ప్యాకేజీల్లో పనుల అంచనాలు 16వందల 90 కోట్లు రూపాయల మేర పెంచేశారని పేర్కొంది. గుత్తేదారులకు అదనపు లాభం చేకూర్చారని ఇందుకు బాధ్యులైన అధికారుల నుంచి ఈ మొత్తాన్ని రాబట్టాలని కమిటీ సూచించింది. ఎడమ కాలువ ప్యాకేజీల్లో మిగిలి ఉన్న పని పరిమాణాన్ని గుర్తించాలని...గుత్తేదారులకు నోటీసులిచ్చి వారిని తొలగించాలని నివేదికలో వెల్లడించింది. న్యాయసలహా మేరకు రివర్స్‌ టెండర్‌కు వెళ్లాలని..ఎడమ కాలువలోని అన్నీ ప్యాకేజీల్లో పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని సూచించింది.

కుడికాలువ పనుల్లోనూ

కుడి కాలు పనుల్లోనూ అక్రమాలు జరిగాయని నిపుణుల కమిటీ తేల్చింది. కుడి కాలువ పనుల్లో ఏడు ప్యాకేజీలకు 1320కోట్ల రూపాయలకే పరిపాలనామేదం ఉంటే నిబంధనలకు విరుద్ధంగా 1841కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారనినివేదించింది. ఈ ఏడు ప్యాకేజీల్లో పనుల విలువను ఏకంగా 231శాతం మేర పెంచేశారని కమిటీ పేర్కొంది. గుత్తేదారులు పనులు ఆలస్యం చేసినా ఎవరిపైనా చర్య తీసుకున్నది లేదని నివేదికలో స్పష్టంచేశారు. కుడి,ఎడమ కాలువ పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై దర్యాప్తు జరిపి శాఖాపర చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ తన నివేదికలో సూచించింది.

Last Updated : Jul 25, 2019, 7:08 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details