విజయవాడ జక్కంపూడి కాలనీకి చెందిన 23 ఏళ్ల గర్భిణికి నెలలు నిండాయి. ప్రసవానికి ఇంకా వారం వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. అప్పటికే ఆమెకు దగ్గు, గొంతు నొప్పి, జలుబు ఉన్నాయి. అనుమానంగానే ఓ ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. తీరా ఆ పరీక్షలో ఆమెకి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. వైద్యుల సలహాతో సీటీ స్కాన్ చేయించుకున్నారు. అందులో కరోనా లక్షణాలు మైల్డ్‌గా ఉన్నట్లు స్పష్టమైంది. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు విజయవాడ కొవిడ్ జీజీహెచ్‌కు (కొత్తాసుపత్రికి) సిఫారసు చేశారు. అక్కడికి వెళ్లి క్యాజువాలిటీలో వివరాలు నమోదు చేసి కాన్పుకు చేరారు. పండంటి ఆడ బిడ్డకు ఆ తల్లి జన్మనిచ్చింది. వైద్యులు చెప్పిన ధైర్యం, సలహాలు బాగా పని చేశాయని యువతి ఆనందం వ్యక్తం చేసింది.
కృష్ణా జిల్లాలో ప్రతి నెలా వేల సంఖ్యలో ప్రసవాలు జరుగుతుంటాయి. కరోనా రెండో దశ తీవ్రత పెరిగిన తరువాత ప్రసవం చేయాలంటే కరోనా పరీక్ష నివేదిక తీసుకురావాలని వైద్యులు కోరుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో గర్భిణులకు ప్రాధాన్యమిస్తున్నారు. గర్భం దాల్చిన నాలుగు నెలల తరువాత నుంచి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. 9 నెలలు పూర్తిగా నిండి 15 రోజులు దాటిన తరువాత గర్భిణులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేస్తున్నారు. అప్పుడు పాజిటివ్ నిర్ధారణ అయితే వెంటనే అప్రమత్తమై విజయవాడ జీజీహెచ్‌లో కరోనా బాధిత గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుకు 108 వాహనంలో సంరక్షకుడి సహాయంతో పంపిస్తున్నారు. ప్రసవానికి ఒకటి రెండ్రోజుల ముందు ర్యాపిడ్ పరీక్ష చేసి వైరస్ సోకలేదని నిర్ధారణ అయితే నిర్భయంగా కాన్పు చేస్తున్నారు.వైద్యుల సూచనలు పాటిస్తూ పోషకాహారం తీసుకుంటూ ధైర్యంగా ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు.
విద్యాధరపురానికి చెందిన 20 ఏళ్ల గర్భిణి కాన్పుకు 15 రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆమెకు తీవ్ర జ్వరం, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులున్నాయి. యువతి ఆందోళన చెందింది. కరోనా ఫలితాన్ని డాక్టర్లకు చూపగా విజయవాడ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. కొవిడ్ ఆస్పత్రి అంటే భయం వేయడంతో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో పడక కోసం ప్రయత్నించారు. ఎక్కడా కరోనా వచ్చిన గర్భిణులకు కాన్పు చేయకపోవడంతో చివరకు విజయవాడ జీజీహెచ్‌కు వచ్చారు. కాన్పుకు వారం రోజుల ముందు ఆమెకు కాస్త లక్షణాలు తగ్గాయి. విజయవాడ జీజీహెచ్‌లో కాన్పు జరిగింది. పండంటి మగ బిడ్డకు ఆ యువతి జన్మనిచ్చింది. కాన్పు అనంతరం వైద్యుల పర్యవేక్షణలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌లను ఇచ్చారు. యువతి ఆరోగ్యం సైతం మెరుగుపడింది. తన బిడ్డకు కొవిడ్ సోకకుండా వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, వారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలమని కన్నీటి పర్యంతమైంది. డాక్టర్లు కంటికి రెప్పలా కాపాడుకున్నారని చెప్పింది.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ